చంద్రబాబు కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు - తడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో, కోస్తా.. సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యల గురించి చంద్రబాబు ఆరా తీసారు.ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో, జిల్లా అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు.