కెసిఆర్ V/S రేవంత్ ..? ఏమిటి గొడవ ?

తెలంగాణా లో ఎన్నికలు అయిపోయినా రాజకీయ వేడి తగ్గలేదు రండ.. ఈ పదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు సీఎంలు ఉపయోగించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. కేంద్ర మంత్రి, బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇలాంటి రండ మంత్రి మనకు అవసరమా అని ఓ ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్‌రెడ్డి.. కేసీఆర్‌ వాడిన భాషను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నారు.తాజాగా రేవంత్‌రెడ్డి..

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో గతంలో కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి దుర్భాషలాడారు. కానీ, తాజాగా సీఎం హోదాలో.. మాజీ సీఎం వాడిన రండ పదానే.. నేడు రేవంత్‌రెడ్డి అదే కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగింత విషయమై బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈతరుణంలో రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఆరోపణలు ఖండిస్తూ.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని ఆరోపించారు. ఈ రండ చంద్రశేఖర్‌రావు ఇప్పుడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు.

 

ఇంతకీ రండ అంటే..

రండ.. అనే పదం ఇద్దరు సీఎంలు వాడారు. కానీ, చాలా మందికి రండ అంటే తెలియదు. దీనికి యాస, భాష ప్రకారం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉపయోగిస్తారు. కానీ, అర్థం మాత్రం ఒక్కటే.. రండ అంటే వేశ్య అని అర్థం. సీఎం హోదాలో ఉండి ఇద్దరు నేతలు ప్రత్యర్థులను వేశ్యగా అభివర్ణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రాజకీయాల్లో బూతుపురాణం వాడే నేతలు ఎవరంటే.. ఏపీవైపు చూపించేవారు. కానీ తెలంగాణ నేతుల ఇప్పుడు ఏపీ నేతలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ యాస, భాష పేరుతో ఉద్యమ సమయంలో కేసీఆర్‌.. బూతు పదాలను కూడా ఇక్కడ ఇలాగే అంటా అని సర్దిచెప్పుకున్నారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే భాష వాడడంతో రాజకీయాల్లో బూతు వాడకం పెరిగింది. యథారాజ తథా ప్రజ అన్నట్లు.. నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు అలాగే వ్యవహరిస్తారు అన్నట్లు… బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా బూతులు మాట్లాడడం నేర్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సీఎంను నోటికి వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా చెప్పు చూపించే వరకు వచ్చాడు. దీంతో పరిస్థితి చూస్తుంటే.. రాజకీయాల్లో బూతుల్లో ఏపీని మించడంతోపాటు, దాడులు కూడా చేసుకునే పరిస్థితి వస్తుందేమో అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.